Headlines

ముంబయి ఇండియన్స్ చేతిలో 8 వికెట్ల తేడాతో చిత్తుగా ఓటమి చెందిన కోల్‌కతా

ముంబయి ఇండియన్స్

IPL 2025 మ్యాచ్ నెం. 12లో ముంబయి ఇండియన్స్ మరియు కోల్‌కతా నైట్ రైడర్స్ జట్లు తలపడ్డాయి. ప్రారంభం నుంచే పూర్తి ఆధిపత్యం సాధించిన ముంబయి ఇండియన్స్ జట్టు 8 వికెట్ల తేడాతో 43 బంతులు మిగిలి ఉండగానే ఘనవిజయం సాధించింది. డెబ్యూ మ్యాచ్‌లో మంచి ప్రదర్శన కనబరిచిన అశ్వనీ కుమార్ ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’గా నిలిచాడు. వాంఖడే స్టేడియం వేదికగా తలపడ్డ ఈ మ్యాచ్‌లో ముందుగా టాస్ గెలిచిన ముంబయి జట్టు కెప్టెన్ హార్దిక్ పాండ్యా బౌలింగ్ ఎంచుకున్నాడు.

బౌలింగ్‌లో అదరగొట్టిన ముంబయి ఇండియన్స్

ముంబయి ఇండియన్స్
ముంబయి ఇండియన్స్

వరుసగా రెండు మ్యాచ్‌ల్లో ఓటమి చెందిన ముంబయి జట్టు ఈ రోజు అద్భుతంగా రాణించింది. ముందుగా బ్యాటింగ్ చేసిన కోల్‌కతా నైట్ రైడర్స్ ఏ దశలోనూ మ్యాచ్‌లో పోటీ ప్రదర్శించలేకపోయారు. పూర్తిగా ఆధిపత్యం చలాయించిన ముంబయి జట్టు అద్భుతమైన బౌలింగ్ ప్రదర్శనతో కోల్‌కతా జట్టును చిత్తు చేసింది. పవర్‌ప్లేలోనే 4 వికెట్లు కోల్పోయిన KKR జట్టు బాగా ఇబ్బందులు పడ్డారు. KKR ఇన్నింగ్స్‌లో అంకిర్ష్ రఘువంశీ (23 పరుగులు) టాప్ స్కోరర్‌గా నిలవగా, మనీష్ పాండే మరియు రింకు సింగ్ సాధించిన 29 పరుగుల భాగస్వామ్యమే టాప్ కావడం గమనార్హం. ఏ దశలోనూ పోరాటపటిమ కనబర్చకుండా వరుస వికెట్లు కోల్పోయిన KKR జట్టు 17 ఓవర్లలోనే ఆలౌట్ అయింది. ముంబయి ఇండియన్స్ బౌలింగ్‌లో అశ్వనీ కుమార్ 4 వికెట్లు సాధించగా, దీపక్ చహర్ 2 వికెట్లు, బౌల్ట్, హార్దిక్ పాండ్యా, విఘ్నేష్, సాంట్నర్ తలో వికెట్ దక్కించుకున్నారు.

తడబడకుండా ఛేదించిన ముంబయి

117 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ముంబయి జట్టు సునాయాసంగా ఛేదించింది. ఏ మాత్రం ఒత్తిడికి లోనవకుండా 43 బంతులు మిగిలి ఉండగానే ఘనవిజయం సాధించింది. ముంబయి జట్టులో రయాన్ రికెల్టన్ 62 పరుగులు సాధించగా, రోహిత్ శర్మ మరోసారి విఫలమయ్యాడు. KKR ఆల్‌రౌండర్ ఆండ్రే రసెల్ ముంబయి జట్టులో రోహిత్ మరియు విల్ జాక్స్ వికెట్లను దక్కించుకున్నాడు. సూర్యకుమార్ యాదవ్ వేగంగా పరుగులు చేసి ముంబయి జట్టుకు విజయాన్ని అందించగా, KKR బౌలర్లలో రసెల్ 2 వికెట్లు దక్కించుకోగా మిగతా వారు నిరాశపరిచారు.

For IPL updates visit Sports

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *